20, మే 2011, శుక్రవారం

ఎండలూ... ... పంచదార ఆవకాయ ...


ఈ వేసవి కాలం ఎండలు చాలా చిరాకు కలిగిస్తాయి. కానీ, మామిడి కాయలు మాత్రం నోరూరిస్తూ అంగట్లో రోజు దర్శనమిస్తూ ఉంటాయి. ఎంత వద్దనుకున్నా ఆ పుల్ల పుల్లని మామిడికాయలు చూస్తూ ఆవకాయలు పెట్టకుండా ఉండ గలమా? ఇంట్టో కుటుంబ సభ్యులకు బి.పి.లు...ఉన్నా....షుగర్లు ఉన్నా...ఆవకాయలు పెట్టడం మాత్రం మానం .ఎంతైనా.. ఆంధ్రులం. సార్ధకనామధేయం తుడిచి పెట్టుకు పోదూ !

మామిడికాయలతో రకరకాలుగా ఆవకాయలు పెట్టొచ్చు.ఈవిషయం అందరికీ తెలిసిందే.ఆవకాయని బెల్లం గాని, పంచదార గాని వేసి తియ్యగా పెట్టొచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఉప్పు తక్కువ తినాలనుకున్నవారికి కూడ కొంత మంచిది. ఎందుకంటే ....మామూలు ఊరగాయ కంటే ఇందులో ఉప్పు
తక్కువ పడుతుంది.

పంచదార వేసి ఆవకాయా?! ..అని ఆశ్చర్య పోతున్నారా? నిజమేనండీ..చాల రుచిగా ఉంటుంది. ఏడాది పొడుగునా నిలవ ఉంటుంది. ఎండబెట్ట నవసరం లేదు. బెల్లం వేస్తే మాత్రం వారం రోజులపాటు ఎండ పెట్టాలి.
పంచదార ఆవకాయ తయారీకి మరీ పుల్లని మామిడికాయలు తీసుకోకూడదు. పులుపు కొంచెం తక్కువ ఉంటే బావుంటుంది.

ఆవపొడి--4 పావులు--కారం--2పావులు--ఉప్పు రెండున్నర పావులు, నూనె 1పావు పంచదార 4పావులు
ఆవపొడి, ఉప్పు, కారం మూడు కలిపిన మిశ్రమాన్ని ఒక గిన్నె లోకి నిండుగా తీసుకోవాలి.అదే గిన్నెతో 2 గిన్నెలు
మామిడికాయ ముక్కలు తీసుకోవాలి.ఆవపొడి మిశ్రమంలో పంచదార వేసి బాగ కలపాలి. మామిడికాయముక్కలు
కొద్ది కొద్దిగ వేస్తూ గుచ్చెత్తి జాడీలో పెట్టాలి.పైన కొద్దిగ నూనె వెయ్యాలి.మూడు రోజులతరువాత మిగిలిన నూనె వేసి
బాగ కలపాలి. ఈ యేడాది పెట్టి చూడండి. ఇక ప్రతి సంవత్సరం పిల్లలు అదే కావాలంటారు. తీపి ఎక్కువ కావాలను
కున్నవారు పంచదార మరి కాస్త ఎక్కువ వేసుకోవచ్చు.

బెల్లం వేసే ఆవకాయకి కూడా కొలతలు అన్నీ పై విధంగానే..కాని..వారం రోజులు ఊరిన తరువాత.. ఊట నుండి ముక్కలు వేరు చేసి...విడి విడిగా ఊట ముక్కలు వారం రోజులపాటు ఎండ పెట్టాలి. తరువాత, ఊటలో ముక్కలు
బాగా కలిపి జాడీలో పెట్టాలి. ఈ ఆవకాయ రెండు నెలల తరువాత తింటే చాల రుచిగా ఉంటుంది.రెండు సంవత్సరాలైనానిలవ ఉంటుంది.









9 కామెంట్‌లు:

కథా మంజరి చెప్పారు...

పంచదార ఆవకాయ గురించి చాలా బాగా రాసారు. నిజంగా అంత బాగుంటుందా ?

రాజేష్ జి చెప్పారు...

$విజయలక్ష్మి గారు

పంచదార ఆవకాయ.. :)

గుజరాతీలు అన్నిట్లో పంచదార వేసి వండుకుంటారు ఆఖరికి పచ్చళ్లలో కూడా. నేనిక్కడ ఉన్నది వాళ్ళయిళ్ళలోనే.
వచ్చినకొత్తల్లో మొదటి ఇంట్లో బల్లమీద మామిడికాయ పచ్చడిలా కనిపించి ఆత్రంగా తినబోతే ఇంటావిడ చెప్పింది అది ఆపిల్ కాయ పచ్చడని. నేను కెవ్వు. ఇప్పుడున్న రెండో ఇంట్లో కూడా పంచదారే..ఒక్కసారి రుచి చూసా.. పంచదార ఆవకాయని.. కెవ్వు..ఇక అంతే :)

మీరిప్పుడు ప.అ అంటే మనవైపు కూడా పెట్టుకుంటారని తెలిసింది. మరి మనవైపు రుచి మారచ్చేమో :).

పంతుల విజయ లక్ష్మి చెప్పారు...

ధన్యవాదాలు రాజేష్.జి గారూ

ముద్దు కృష్ణ జ్యోతి చెప్పారు...

ఔను పంచదార ఆవకాయ చాలా బాగుంటుంది. ఈ ఏడాది మీరు ఈ బ్లాగులో చెప్పెని పంచదార, బెల్లం ఆవకాయలు రెండూ పెట్టాను. పులుపుకి తీపి మచి జోడీనే. బెల్లం పులుసులూ, బెల్లం కూరలూ మన ఆంధ్రా జిల్లాల్లోనే ఎక్కువ. మిగిలిన వాళ్ళకి చెప్తే 'కెవ్వు ' మంటుంటారు. ఆవకాయ రుచి ఒక ఎత్తైతే, చిన్నప్పుడు ప్రతి వేసవికీ ఇంట్లో ఆవకాయలు పెట్టిన జ్ఞాపకాల అనుభూతి ఒక ఎత్తు. బ్లాగు బహు బాగుంది. అసలు ఆవకాయ ఫొటో ఏదీ?

పంతుల విజయ లక్ష్మి చెప్పారు...

నా టపా నచ్చినందుకు సంతోషం...నిజమే..మీరన్నట్టు
తెలుగువారందరికీ ఆవకాయలంటే చాలా ఇష్ఠం. హమ్మయ్య
మీరు కూడా ఆవకాయలు పెట్టడం పూర్తయిందన్న మాట.
ప్రస్తుతానికి ముక్కల ఫొటో ఉంచాను.ఆవకాయ తయారవాలి కదా !

swathi చెప్పారు...

హలో విజయ అక్క
చాలా బాగా రాశావు . నేను కూదా ఆవకాయ పెట్టేసుకున్నాను. అయితే మా అత్తగారింట్లో కుడా ఆవకాయలో బెల్లం
అంటే కెవ్వు!. అందుకని కేవలం పిల్లలకి మాత్రం పంచదార ఆవకాయ పెట్టెను. మిగతావన్నీ కారం మరి కాస్త
ఎక్కువ వేసి, ఆవకాయ,మాగాయ, తొక్కుడు పచ్చడి.అన్నీ చాలా బాగా వచ్చేయి ఈసారి.
పంచదార ఆవకాయ ఫార్ములా మాత్రం నీదే.

మాలా కుమార్ చెప్పారు...

పంచదార ఆవకాయ మాకు తెలీదండి . బాగుంది .

kiran చెప్పారు...

amma, bellam avakaya gurinchi nuvvo konda gurthu kuda cheptavu.adi, manavaallu vaisakham lo petti aashadam radhayaatra natiki teestaru ani.

పంతుల విజయ లక్ష్మి చెప్పారు...

కిరణ్, మన వేపు బెల్లం ఆవకాయ పెట్టడం. తినడం ఏ యే మాసాలలో సాధారణంగా చేస్తూ ఉంటారో, దాని గురించి నువ్వు చెప్పినది. నిజమే. నాకా విషయం గుర్తే లేదు. బాగా గుర్తు చేసావు.