24, నవంబర్ 2011, గురువారం

వంకాయ బండపచ్చడి


వంకాయని వెయ్యి రకాలుగా వండొచ్చని నానుడి ఉంది కదా..సంతర్పణ వంటల్లో తప్పని సరిగ వంకాయని వండుతారు. వంకాయని ఉడికించి గాని, నూనెలో వేయించి గానిచేస్తుంటాం. అలా కాకుండా వంకాయని నిప్పులమీద కాల్చి చేసే రకం. చాలా బాగుంటుంది. ( గేస్ స్టౌవ్ మీద కూడ సిమ్ లో పెట్టి కాల్చొచ్చు )

పెద్ద సైజు వంకాయలు కాల్చడానికి వీలుగ ఉంటాయి. అవి తీసుకోవాలి.

వంకాయ బండ పచ్చడి ఎలా చెయ్యాలో చెప్తాను.

కావలసిన పదార్ధాలు;

1. వంకాయలు --1 లేక 2 పెద్ద సైజువి

2. అల్లం -చిన్నముక్క

3. ఆవాలు

4. జీలకఱ్ఱ

5. మినపప్పు

6. ఎండు మిర్చి

7. పచ్చి మిర్చి

8. చింతపండు --తగినంత

9. ఉప్పు

10. పసుపు

11. కొత్తిమీర - చిన్న కప్పు

వంకాయని మొదట కాయంతటికి పట్టేలా కాస్త నూనె రాయాలి. ఇప్పుడు నిప్పుల మీద కాల్చాలి. చల్లారేక పై తొక్క తడిచేసుకుంటూ జాగ్రత్తగా తియ్యాలి. లోపలి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి . ఇప్పుడు అల్లం, పచ్చిమర్చి, చింతపండు, ఉప్పు, పసుపు కొత్తిమీర అన్నీ రోటిలో వేసి బండతో చితకొట్టాలి.

తరువాత వంకాయగుజ్జు కూడ వేసి కచ్చా పచ్చాగ చితకొట్టి ఒకగిన్నెలోకి తీసుకోవాలి.ఇపుడు స్టౌమీద మూకుడు పెట్టి కాస్త నూనె వేసి వేడెక్కాక ఆవాలు. జీలకఱ్ఱ, మినపపప్పు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టి పచ్చడిలో కలపాలి. వంకాయ బండ పచ్చడి రెడీ. అన్నంలోకి బాగుంటుంది. నచ్చితే చపాతితో కూడ తినోచ్చు. వంకాయపులుసు పచ్చడి మరోసారి చెప్తాను.