28, జులై 2015, మంగళవారం

మా గోదావరి పుష్కర యాత్రా విశేషాలు

                
                మా  గోదావరి పుష్కరయాత్రా విశేషాలు

        గోదావరి పుష్కరాలకి  రాజ మండ్రి వెళదామని ఏడాది ముందు నుండే మేం సిద్ధ పడి పోయేం ! ఎలాగూ రాజమండ్రిలో మా మరిదీ వాళ్ళూ ఉన్నారు కనుక, ఇబ్బంది ఉండదని వెళ్లడానికి సిద్ధపడ్డాము.  మా మరిది కూడా అందరినీ పుష్కరాలకి రమ్మని మరీ మరీ చెబుతూనే ఉన్నాడు.అదీ కాక,  మా దంపతులం  ఇంత వరకూ  ఏ నదీ పుష్కరాలకీ వెళ్ళ లేదు.
నదీప్నానమంటే ఎవరికి సరదా ఉండదు?
 గోదావరిలో పుష్కరస్నానానికి మా బంధువులం పది మందిమి రాజమండ్రి బయలుదేరాము.అందరం సీనియర్ సిటిజన్ లమే. శ్రీకాకుళం నుండి మా మరిది లక్ష్మణ్ , తోటికోడలు శారద విజయనగరం నుండి మా జంట, మధురవాడనుండి మా ఆడపడుచు విశాల , విశాఖ నుండి  మా పినమామ గారు పంతులసీతాపతి దంపతులు, మా వారి కజిన్ రమ, వాళ్ళాయన కృష్ణ మరో కజిన్ లిల్లీ..      అందరికీ విశాఖ నుండి నాగావళి  ఎక్స్ ప్రెస్ కి రిజర్వేషన్ చేయించుకున్నాము. ట్రయిన్ 20వ తేదీ రాత్రి ఏడు గంటలకి.  నెల్లాళ్ళ ముందుగానే రానూ పోనూ ఎంచక్కా అందరికీ రిజర్వేషన్లు అయ్యాయి కనుక మా ప్రయాణం ఇక  నల్లేరు మీద  బండి నడకే అనుకున్నాం ! అయితే,  మొదటి రోజు పుష్కర ఘాట్ దగ్గర జరిగిన దుర్ఘటనకి  అందరం భయపడ్డాము. చాల బాధఅనిపించింది. దానితో  వెళ్ళ గలమా అని భయ పడ్డాం. బయలుదేరే  రోజు దగ్గర పడుతున్న కొద్దీ అందరిలోనూ అసలు రైలంటూ ఎక్క గలమా ! అనే అనుమానం మొదట చిన్నగా మొదలై క్రమేపీ ఎక్కువ కాసాగింది. కారణం ఏమిటంటే, పత్రికల లోనూ. టీ వీలలోనూ వస్తున్న వార్తలు వింటూ,చూస్తూ ఉంటే మాకలా అనిపించ సాగింది. రైళ్ళన్నీ గంటల కొద్దీ ఆలస్య మవుతున్నాయిట ! బస్సులలో   ఎక్కడానికే వీళ్ళేనంత రద్దీగా ఉంటోందిట.

ఒక దశలో మా ప్రయాణం మానుకుందామా ?  అని కూడా ఆలోచించేం. కానీ మా మరిది  ‘ వచ్చెయ్యండి ఇక్కడ నేను చూసు కుంటాను ’ అని భరోసా ఇచ్చేడు.

మా అందరివీ బెర్తులు ఒకే కంపార్టు మెంట్ లోనే ఉన్నాయి. కానీ నాలుగు బెర్తులు  వొక చోట, తతిమ్మా  ఆరూ మరో చోట దొరికాయి. ట్రయిన్ రద్దీగా ఉంటుంది కనుక  రాత్రి టిఫిన్లకి ఇబ్బంది కాకుండా ఈ సారికి ఎవరి టిఫిన్లు వాళ్ళు తెచ్చు కుందామని అనుకున్నాం. శ్రీకాకుళం నుండి రావలసిన మా మరిదీ వాళ్ళూ నేరుగా వైజాగ్ లోనే స్టేషన్లో కలుస్తామని చెప్పేరు. వాళ్ళకి కూడా నేనే టిఫిన్ పట్టు కున్నాను.

మేం    ఇంటి దగ్గర బయలు దేరి ఐదింటికల్లా  వైజాగ్ స్టేషన్కి చేరాం. స్టేషన్  లో దిగీ దిగగానే మేం ఎక్క వలసిన ట్రయిన్ అయిదు గంటలు లేటని తెలిసింది ! అంటే 12 గంటలకి వస్తుందన్న మాట !  మామ్మూలుగా రాజమండ్రి చేర వలసిన టైముకన్నా  రెండుగంటలు ఆలస్యంగా ట్రయిన్ ఎక్కేలా ఉన్నాం !  పుష్కరాల కష్టాలు మొదలయ్యేయి కాబోలని నవ్వు కున్నాం !
టైము ఎనిమిదవుతూం టే  టిఫిన్లు కానిచ్చీసేం. కాస్సేపటికి వైజాగులో ఎక్క వలసిన మిగతా అందరూ ప్రయాణానికి సిద్ధం చేసుకున్న టిఫిన్లు ఇంటి దగ్గరే కానిచ్చీసి తొమ్మిది కల్లా  స్టేషన్ కి వచ్చీసేరు. అందరం ఒకటో  నంబరు ప్లాట్ ఫారమ్  మీద హాయిగా కబుర్లు చెప్పు కుంటూ కూర్చున్నాం.  టైం తెలియ లేదు.  విశాఖ నుండి రాజ మండ్రికి రెండు స్పెషల్ ట్రైన్లు మా ముందే వెళ్ళాయి. రైల్వే అధికారులూ, పోలీసులూ వాటిలోకి జనాలను క్యూ లైన్ లలో ఎక్కించారు. ఎక్కడా తొక్కిసలాట లేదు. మేం హమ్మయ్య  అను కున్నాం. రద్దీని ఎంత చక్కగా కంట్రోలు చేస్తున్నారో కదా!  అని మురిసి పోయేం . ఇక మా ప్రయాణానికి ఏ ఇబ్బందీ లేదనీ,  బెర్తుల మీద  వో మూడు గంటలయినా చక్కగా కునుకు తీయొచ్చు కదా అనుకున్నాం.అయితే, మా ఆశలు అడియాసలవడానికి ఎంతో సేపు పట్ట లేదు. ఈ లోగా అసలు మేం ఎక్క వలసిన రైలు అవేళ బయలు దేరినట్టే లేదనే వార్తలు వచ్చి, ఇదేంట్రా బాబూ ! అను కున్నాం. రైల్వే ఎంక్వరీలో అధికారులు తలో మాటా చెబుతూ ఉండండతో , ఏ సంగతీ తెలుసు కోడానికి విజయ నగరంలో ఉండే మా చిన్నమ్మాయి ఆశాకి మేమూ, హైదరాబాదులో ఉండే వాళ్ళమ్మాయి దీప్తికి మా మరిదీ ఫోన్లు చేసాం. అలాగే పార్వతీ పురంలో ఉండే మా ఆడ పడుచు మరిది రమణకి కూడా ఫోను చేసి  రైలు పొజిషను ఏఁవిటో కనుక్కో మన్నాం. కాస్సేపు కబుర్లూ జోకులూ కట్టి పెట్టి, రైలు రద్దయితే తర్వాత ఏం చేయాలో ప్రణాళికలు వేయ సాగేం. మరి కాస్సేపటికి రైలు రద్దు కాలేదనీ, రాయ గడ వదిలిందనీ, మరో రెండు గంటల్లో వస్తోందనీ  కిరణ్. దీప్తి, రమణల నుండి ఫోన్లు వచ్చేయి. మళ్ళీ మా ఆశలు చిగురించేయి. మళ్ళీ మొదలయ్యాయి ... మా కబుర్లూ, జోకులూనూ !

ఎలాగయితేనేం ! రాత్రి పన్నెండు  గంటలు కావొస్తూ ఉంటే, ఆఖరి నిముషంలో ట్రయిన్ రెండో నంబరు ప్లాట్ ఫారం లోకి వస్తుందని ఎనౌన్స్ చేసారు ! పొలో మని అందరం హడావిడిగా  వెళ్ళాం. జనం క్రిక్కిరిసి పోయి ఉన్నారు. మేం ఎక్క వలసిన రిజర్వేషను భోగీతో పాటూ అన్ని కంపార్టు మెంట్ల లోనూ జనం వేలాడుతున్నారు. ఆ రద్దీలో మా బెర్తుల మాట దేవుడెరుగు  అసలు రైలు ఎక్కుతామని ఆశ కూడా లేకుండా పోయింది. మా నాగావళి Long Distance train కనుక అప్పటికే ప్రయాణీకులతోకిట కిట లాడుతూ వచ్చింది.

కథ మళ్ళీ మొదటి కొచ్చిందిరా బాబూ ! అను కున్నాము.

అంత రద్దీ లోనూ నేనూ,  లిల్లీ, రమా ఎలాగో ట్రయిను లోకి జొర బడ్డాం.కానీ, డోర్ దగ్గరనుండి   లోపలికివెళ్ళలేకపోయాము.ఏంచేయాలో తోచలేదు. అప్పటి కింకా మావాళ్ళు ఏడుగురు బయటే ఉండి పోయేరు. ఎక్కే సావకాశమే లేదు. ఇక లాభం లేదని మేం అతి ప్రయాసతో రైలు దిగేశాం. ఇక మా పుష్కర యాత్ర హుళక్కే అని నిరాశ చెంది, ప్లాట్ ఫారమ్ మీద ఉండి పోయేం.
పెద్దగా ఆశ లేక పోయినా, రమా వాళ్ళాయన కృష్ణ గారు ఏ.సీ కంపార్టు మెంటు దగ్గర ఉన్న టీ.సీ దగ్గరకి చివరి ప్రయత్నం చేయడం కోసం వెళ్ళారు. మా శారద అతనిని అనుసరించి వెళ్ళింది. మావి మొత్తం పది కన్ ఫర్మ్ డు బెర్తులనీ, ట్రయిన్ ఎక్కే సావకాశమే లేదనీ , అందు వల్ల అందరం ఏ.సీ భోగీలో ఎక్కేస్తామనీ చెప్పారు.  ( మాకు ఏ.సీ లో బెర్తులు ముందే దొరికి ఉంటే ఈ గొడవే లేక పోదును.) అక్కడే ఉన్న ఇద్దరు పోలీసులతో దగ్గరుండి  మా పది మందినీ  మా భోగీలోకి ఎక్కించాలనీ. లేక పోతే ఏ.సీలో ఎక్కేస్తామనీ దబాయించేరు!  కెమేరాలో వాళ్ళ ఫొటోలు తీసి  మీడియాకి ఇస్తాం అని  మరి కాస్త రెట్టించీ సరికి ఏమను కున్నారో, పదండంటూ పోలీసులు లతని వెంట మా భోగీ దగ్గరకి వచ్చేరు. మా పది మందినీ ఒక లైనులో నించో మని చెప్పి, ట్రయిను లోకి జొరబడి, మా బెర్తులలో  మిడిల్ బెర్తుల వాళ్ళని లేపీసి, లోయర్ బెర్తులు రెండూ ఖాళీ చేయించి మమ్మల్ని  ఎక్కించారు.రైల్లో అప్పటికి పేన్లు లేవు. జనం క్రిక్కిరిసి పోయి ఉన్నారు. చెమట్లు పట్టి పోతున్నాం.  అందరం పద్మ వ్యూహంలో అభి మన్యుల్లా ఎలా అయితే నేం మా బెర్తుల దగ్గరకి చేరు కున్నాం ! అక్కడున్న మా నాలుగు బెర్తులకీ గానూ రెండింటినే సాధించ గలిగేం ! మిగతా ఆరు బెర్తులూ దూరంగా ఉండడంతో ఇక వాటి మీద ఆశ వదిలేసు కున్నాం. అప్పటికే దర్జాగా మా మిడిల్ బెర్తుల మీద పడుకుని వస్తున్న వాళ్ళని పోలీసులు  ఖాళీ చేయించడంతో వాటిని కిందకి దించేసి, మొత్తం ఎదురెదురు లోయరు బెర్తుల రెండింటి మీద పది మందిమీ చతికిల పడ్డాం ! ఒక అప్పర్ బెర్తు మీద సామాన్లు పక్కకి నెట్టి మా వారు కాస్సేపు నడుం వాల్చేరు. ఆ తరువాత కృష్ణ గారు  అదే బెర్తు మీద కాస్సేపు నడుం వాల్చేరు. కాస్సేపటికి ట్రయిను కదిలే వేళకి ఫేన్లు తిరగడం మొదలయ్యాయి. అంతా హమ్మయ్య ! అని ఊపిరి పీల్చు కున్నాం. ప్రాణాలు లేచొచ్చి నట్టయింది !
ఇక బెర్తుల మీద పడుకుని ప్రయాణం చేసే ఆశ ఎలాగూ లేదని తేట తెల్ల మైంది కనుక,  జాగరణకి సిద్ధ పడి పోయేం ! ‘ పుష్కర స్నానాలు చేయ డానికి ముందు రోజు రాత్రి జాగరణ చెయ్యొద్దూ ! అంచేత మనకి మరింత పుణ్యం వస్తుంది లెండి ! అంటూ జోకులు వేసు కున్నాం. కబుర్లు ప్రారంభించేం. నిజం చెప్పా లంటే, మా కబుర్ల తోనూ. జోకులతోనూ నిద్రే రాలేదు. చూస్తూ ఉండగానే తెల్లగా తెల్లారి పోయింది.
ట్రయిను  సామర్ల కోట దాటింది.  మరెంత సేపు !  మరో గంటలో రాజ మండ్రి చేరి పోమూ ! అనుకుని అందరం సంబర పడ్డాం. తెల్లారు ఝూమున  ఐదు  గంటలకి చేర వలసిన ట్రైను నిక్కుతూ నీలుగుతూ ఎనిమిది దాటేక కానీ రాజ మండ్రి చేర లేదు. పాపం, మా మరిది మా కోసం రాజ మండ్రి స్టేషన్  లో ఐదింటి నుండీ కాపు కాస్తున్నాడు.

ఎలా గయితే నేం క్షేమంగా రాజ మండ్రి చేరాం. మేం రాత్రి పదింటికే వస్తామనీ, ఉదయాన్నే ఆరింటికే పుష్కరాల రేవుకి వెళ్ళడానికి ఆటోనీ, పిండ ప్రదానాలు చేయించ డానికి పురోహితుడినీ మాట్లాడి ఉంచేడు మా మరిది. ఇప్పుడా టైం టేబిలు అంతా తారు మారయింది. ముందు ఇంటికి చేరాక, స్నానాదికాలు, టిఫిన్లూ కానిచ్చేక ఏం చెయ్యాలో ఆలోచిద్దాం, పదండి అంటూ బయలు దేర దీసాడు. స్టేషను ఎదురుగానే ఉచిత బస్సు ఖాళీగా ఉంది. మమ్మల్ని అందులో ఎక్కించి, వెనుక
 టూ వీలర్ మీద అనుసరించేడు మా మరిది. బస్సు నేరుగా వాళ్ళుండే  L.I.C  క్వార్టర్ల ఎదురుగా తాతాక్కాలికంగా ఏర్పాటు చేసిన బస్ స్టేషన్  లో ఆగుతుందనీ, అదే చివరి స్టాప్ అనీ చెప్పాడు. ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఉచిత బస్ లో హాయిగా ఇంటికి చేరాం! వేసవి కాలం చిరు జల్లుల్లా అను క్షణం  ఆటంకాలు ఎదురవుతున్నా, అధిగ మిస్తూ పెద్దగా అలసట తెలియ కుండానే ఇంత వరకూ మా ప్రయాణం సాగిందనే చెప్పాలి ! పది మంది అయిన వాళ్ళతో  ప్రయాణం కనుక, ఇదో  మంచి అను భవం కదా ! సరదా సరదా కబుర్లతో ఇంటికి చేరాం !
            అందరం 10గం.అయ్యేసరికి రెడీ అయి పోయేము. రమణ,మణి మమ్మల్ని కోటిలింగాలరేవుకి తీసుకుని వెళ్ళారు.ఆటో దిగాక ఒక కిలోమీటరు దూరం నడిచి రేవుకి చేరుకున్నాము.అందరం నదిలోకి దిగి మూడు మునకలు వేసి ఒడ్డుకు చేరుకున్నాము.ఆ తడి బట్టలతోనే పురోహితుడు చెప్పిన చోటికి వెళ్ళి పిండ ప్రదానకార్యక్రమం పూర్తి చేసుకున్నాము.  అటూ ఇటూ  మూడు తరాల వారి గోత్ర నామాలతో పిండ ప్రదానాలు జరిపించేరు.  అంతే కాక, బావ మరుదులూ, తోటల్లుళ్ళూ , అత్త మామలూ, అక్క చెల్లెళ్ళూ, అన్నాదమ్మలూ వంటి బంధువులకూ,  మిత్రులకూ కూడా  ఎవరి పేర్లతో నయినా పిండ ప్రదానాలు చేయించ వొచ్చని చెప్పారు. అంచేత  మేం చేయ వలసిన వారికందరికీ చేశాం. శాస్త్రోక్తంగా అన్ని దానాలూ చేయించారు. గోదాన సమయంలో  వెండి గోవుల ప్రతిమలు పురోహితులే సమకూర్చి పెట్టారు.  విశాల, లిల్లి ల చేత కూడ గోదానాలు ఇప్పించారు.
ముక్తి...మోక్షం, ముక్కోటిదేవతలు ఆ సంగతి ప్రక్కన పెడితే పితృదేవతలు అందరినీ ఒకసారి తలుచుకొని,పిండప్రదానం చేయడం  ఒక తృప్తిని కలిగించే అంశం ! మనపెద్దలు ఇప్పుడు లేనంతమాత్రాన వారు లేరని అనలేం కదా..ఎక్కడో ఉన్నారు..మనల్ని ఆశీర్వదిస్తారూ.. అన్న నమ్మకమే ఇన్ని కోట్ల మందిని పుష్కరాలకి వెళ్ళేలా చేసిందేమో అనిపిస్తుంది.  పిండాలు నదిలో కలిపి కాళ్ళూ చేతులూ కడుక్కు రమ్మని పురోహితుడు చెప్పారు. ఆ సమయంలో మరో సారి స్నాలు చేద్దామని అను కున్నాం. కానీ అలా చేయ కూడదని చెప్పడంతో విరమించు కున్నాం. మగవాళ్ళు నదికి వెళ్ళి పిండాలు కలిపి వచ్చేక పురోహితునికి దక్షిణలు సమర్పించుకుని ఆశీర్వచనాలు అందుకుని ఇళ్ళకు బయలు దేరాం, 
         అందరం ఇంటికి చేరేసరికి 3గం. దాటింది.భోజనం చేసి ఒక గంట రెస్ట్ తీసుకున్నాక ,నిత్యహారతి చూడటానికి పుష్కరఘాట్ కి తీసుకుని వెళ్ళాడు మా రమణ.

మేం వెళ్ళేసరికే జనం బాగ చేరిపోయారు. మేం దూరం నుండి చూడాల్సి వచ్చింది. హారతి కార్యక్రమం పూర్తయ్యాక జనం కాస్త పల్చబడ్డాక,నదిఒడ్డుకి వెళ్ళి ఇంటికి తీసుకుని వెళ్ళడానికి బాటిల్స్ తో గోదావరి నీటిని పట్టుకున్నాము.
         ఇక ,మర్నాడు ఉదయం మా  తిరుగు ప్రయాణం.. ఉదయాన్నే లేచి అందరం తయారయిపోయాము.
ఈలోగా మణి ఇడ్లీలు, కొబ్బరి చెట్నీ చేసేసింది. టిఫిన్ చేసి స్టేషన్ కి బయలుదేరుదామనుకుంటున్న సమయంలో తెలిసింది...మాట్రైన్ కేన్సి ల్ అయిందని. చేసేదేమిలేక బస్సులో బయలుదారడానికి సిధ్దపడ్డాము. బస్సులు చాల రష్ గా ఉంటాయి.. ఎలా ఎక్కుతామా అని భయపడ్డాము. ఆటోలు దిగగానే రోడ్డు మీదే పెద్ద క్యూ కనిపిచింది..  అడిగితే విశాఖ వెళ్ళే నాన్ స్టాప్ బస్సులో సీటు కోసమని తెలిసింది.  నిలబడైనా ప్రయాణం చేస్తామన్నవారికి వేరే క్యూ ఉందని తెలిసింది.వాళ్ళకి ఫ్రీ ..టిక్కెట్ తీయక్కర్లేదు. , పోలీసులు చాలమంది దగ్గరుండి రద్దీని కంట్రోల్ చేస్తూ ప్రయాణీకుల్ని బస్సుల్లోకి ఎక్కించారు. అందరం హాయిగా సీట్లలో కూర్యుని హమ్మయ్య అనుకున్నాము. రాజమండ్రిలో 10 గం.కి బస్సు బయలుదేరితే విశాఖ చేరేసరికి 4గం. అయ్యింది. మధ్యలో 15 ని. అన్నవరం దగ్గర భోజనాలకోసం  బస్సు ఆగింది.మేమిద్దరం అక్కడ భోజనం చేసాము.వైజాగులో దిగి పోయే వాళ్ళు బిస్కెట్ లు తిని ఫ్రూటీలు తాగేరు. మేం వైజాగ్ లో బస్సు దిగగానే విజయనగరానికి ఏ.సి. బస్సు సిధ్ధంగా ఉంది. వెంటనే ఎక్కేసాము. ఇంటికి చేరేసరికి సాయంకాలం 6గం. అయ్యంది. చెప్పాలంటే, మా తిరుగు ప్రయాణం ఎంతో కష్ట మయి పోతుందనుకున్న మాకు చాలా సుళువుగానూ, సుఖంగానూ జరిగింది. రాజ మయండ్రి బస్ స్టేషను దగ్గర దాదాపు రెండు మూడు వందల మంది పోలీసులతో, క్యూ లైన్  లు ఖచ్చితంగా అమలు చేస్తూ అధి కారులు చేసిన ఏర్పాట్ల వల్లనే అంత సుఖంగా బస్సులు ఎక్కి రాగలిగాము.
సంకల్పం బలంగా ఉంటే కార్యాలు సుళువుగా నెర వేరతాయి అంటారు  పుష్కరాలకి వెళ్ళాలనే సంకల్పం మా అందరిలోనూ బలంగా ఉంది కాబోలు.  పుష్కరాల వేళ ఉద్యోగ రీత్యా రాజ మండ్రిలో ఉండే సదవకాశం లభించి నందుకు  అందరూ రావాలనే ఆకాంక్ష మా మరిదీ, మణీ లకు కూడా ఉండడం చేత ఎన్నో సంశయాల మధ్య యాత్ర చేసుకుని రాగలిగేం. రమణ మణి చక్కని ఆతిథ్యం ఇచ్చేరు మా ఆడ వాళ్ళందరికీ చీరలు పెట్టి వీడ్కోలు చెప్పారు

ఇవీ మా గోదావరి మహా పుష్కర యాత్రా విశేషాలు .
శుభమ్.