ఓం శ్రీమాత్రేనమహ:
మా రెండురోజుల పూరి ,కోణార్క,భువనేశ్వర్ యాత్రావిశేషాలు
22 .11.2019 శుక్రవారం
మా ఇంటికి దగ్గర లో ఉన్నవేదమాత గాయత్రీదేవి
ఆలయానికి వెళ్దామని మా దంపతులం తయారవుతున్నాము.ఇంతలో మా మరిది రమణ ఫోన్ చేసాడు. ఆ దంపతులు నరసన్నపేటలో LIC లో పనిచేస్తారు. మరదలు పేరు మణి. రేపు శని
ఆదివారాలు రెండు రోజులు పూరి, ,కోణార్క, భువనేశ్వర్
కారులో వెళ్తున్నాము, లక్ష్మణ్(postal Dpt Retd శారద వదిన LIC .. శ్రీకాకుళం మాఇంకో మరిది, తోటికోడలు) వస్తున్నారు
మీరూవస్తారా అని అడిగేడు. వాళ్ళు
నలుగురికీ వారాంతపు శలవలువస్తే
బయటప్రదేశాలకు వెళ్ళి గడపడంలో చాలా
అసక్తి. . నాకు కొంత కంగారు వచ్చేసింది.ఈ మధ్య మా ఇద్దరికీ ఆరోగ్యం కొంత చెడింది. .దూర ప్రయాణాలు చెయ్యడానికి భయపడుతున్నాము. ఆమాటే అంటే
మీకేం ఫరవాలేదు మేమున్నాము కదా తప్పకుండా
బయలుదేరండి అని ఇద్దరు మరుదులూ భరోసా
చ్చారు.
ఏ సంగతీ ఆలోచించుకుని చెప్తామన్నాము. ఆలయానికి
వెళ్ళి , అమ్మవారిని దర్శించుకుని ఇంటికి వచ్చాము. సుమారుగా ఇరవై సంవత్సరాల క్రితం
విశాఖలో ఉంటున్నమా చెల్లెళ్ళు మేము కలసి ట్రైన్ లో వెళ్ళాము. మనసులో మళ్ళీ
చూడాలన్న కోరికైతే ఉంది. ప్రసిద్ధ
పుణ్యక్షేత్రాలకి ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీమళ్ళీ వెళ్ళి దర్శించుకోవాలనిపిస్తుంది.
సరే ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని ఇంటికి వచ్చాము. అమ్మవారిమీద
భారంవేసి మేముకూడ వెళ్ళడానికి సిద్ధమయ్యాము.
తే.23.శనివారం ఉదయం 6.00 గం.కి
శ్రీకాకుళం నుండి బయలుదేరడానికి మా అందరికి సరిపోయే 7 seater vehicle book చేసారు. మేము
ముందురోజు సాయంకాలం 4గం.కి విజయనగరంనుండి Bus లో
బయలుదేరి శ్రీకాకుళం మా పెద్ద మరిది లక్ష్మణ్ ఇంటికి చేరుకున్నాము.
మా మొదటిరోజు
ప్రయాణం
ఉదయాన్నే గం.5.30 కి Driver ని రమ్మని
చెప్పాము. చెప్పిన సమయానికి Driver Car తీసుకుని వచ్చారు .ఆయనకి
RTC లో 40 సంవత్సరాలు
పనిచేసిన అనుభవం ఉంది . పెద్దాయన.. చాల బాగ తీసుకుని వెళ్ళి, తీసుకొచ్చారు
అనుకున్న సమయాని కంటే ఒక
అరగంట ఆలస్యంగా గం.6.00 కి మా నలుగురితో కారు బయలు దేరింది. వెంటనే
నరసన్నపేట లో ఉన్నమామరిది రమణకి ఫోన్ చేసి చెప్పాము.మొదట పూరి వెళ్ళి జగన్నాథస్వామిని
దర్శించుకోవాలని నిశ్చయించుకున్నాము. శ్రీకాకుళం
నుండి పూరి 328 కి.మీ 7గం.ప్రయాణం ఉంటుంది. ఉదయాన్నే ప్రయాణం చాల హాయిగా, ఆహ్లాదంగా ఉంది. మంచు కురుస్తోంది. దూరంగా
మంచుతెరల్లోంచి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు ఉదయిస్తూ దర్శనమిచ్చాడు.. ఆ
వాతావరణాన్ని ఆస్వాదిస్తూ నరసన్నపేట ఎప్పుడు చేరామో తెలియలేదు. రమణ ఇంటికి చేరాము.
వాళ్ళిద్దరూ మాకోసం ఎదురుచూస్తూ ఉన్నారు.మాతో
చేరారు
దారిలో గం.9.00 కి
రోడ్ సైడ్ ఒక దగ్గర ఆగి , టిఫిన్లు చేసాము. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. బయటతిండి
పడదని మా శారద నాకోసం పొంగరాలు టమాటా పచ్చడి పేక్ చేసింది.నేను దానిని కానిచ్చాను. అక్కడ టిఫిన్లు బాగున్నాయని
మావాళ్ళు చెప్పారు టిఫిన్లు అయ్యాక మా ప్రయాణం
మొదలయ్యింది. అప్పుడు మా డ్రైవరు , వెళ్ళేదారిలో నే సైడ్ రోడ్ లో 17 కి మీ వెళ్తే, సిద్ధభైరవి ఆలయం ఉంది చాల బాగుంటుంది..,నేను ఈ
మధ్యనే చూసాను ..వెళ్తారా అని అడిగారు. మేమూ ఇదివరకు చూడలేదు. వెంటనే అందరం సరే
అన్నాము. ఒక అరగంటలో ఆలయానికి చేరుకున్నాము.
మంత్రిది అనే చిన్న గ్రామంలో సిద్ధభైరవి
ఆలయం ఉంది.ఇక్కడకి బరంపురం 18 కి. మీ ఉంటుంది. ఇక్కడ అమ్మవారు ఒక కాలు, మూడు
చేతులతో ఉంటుంది. ఈ ఆలయాన్ని 1937 లో పునర్నిర్మించారు. సంక్రాంతి రోజులలో ఒకనెల
జాతర జరుగుతుంది. మగళవారం రద్దీగా ఉంటుంది. ఇందులో 108 ఉపాలయాలు ఉన్నాయి. కాశ్మీరు
నుండి కన్యాకుమారి వరకు ఉన్న శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు, ,వైష్ణవీదేవి, వేంకటేశ్వర స్వామి, ,రంగనాధుడు మీనాక్షీదేవి, బదరీనాధుడు
జగన్నాధస్వామి...ఇలా గర్భగుడి చుట్టూ వసారాలలో 108 విగ్రహాలు ప్రతిష్టింపబడి ఉన్నాయి. కలియుగ భైరవిగా చెప్పబడే భైరవీమాత అలయంలో కల్కీ అవతారం కూడ ఉంది.
మూడుప్రక్కలా విశాలంగా పొడవుగా ఉండేవసారాలలో నడుస్తూ ఉపాలయాలన్నీ చూసాక సిద్ధభైరవిని
దర్శించుకున్నాము. తల్లి విశాలమైన కళ్ళతో
ప్రశాంత వదనంతో ఆకర్షనీయంగా ఉంది. ఇక్కడ సుభద్ర బలరామ సమేతుడైన జగన్నాథ స్వామి
ఆలయం కూడా ఉంది.ఆలయంలో దర్శనం బాగ జరిగింది. ఫొటోలు తీసుకున్నాము. అన్నీ చూసుకుని
బయటకి రావడానికి అరగంట సమయం పట్టింది. మళ్ళీ
మా ప్రయాణం మొదలైంది.
పూరి
పూరి చేరేసరికి మధ్యాహ్నం గం.2.30. అయింది.ఆరాత్రికి
అక్కడే బస . మా మరుదులిద్దరూ కారుదిగి
వసతికొోసం ప్రయత్నించారు. వెంటనే అందుబాటు ధరలో మంచి లాడ్జి దొరికింది. అందరం ఫ్రెష్ అప్ అయ్యి
బయటకి వచ్చి హోటల్ కి వెళ్ళాము. మా ఆయన భోజనం, మిగిలినవాళ్ళు టిఫిన్లు చేసారు..
నేను ఇంటి నుండి తెచ్చుకున్న పెరుగన్నం తిన్నాను. .మాలాడ్జికి 2 కి.మీ.
దూరంలో జగన్నాధస్వామి ఆలయం ఉంది .గుడికి
అర కి.మీ. దూరంలో CAR
Parking ఉంది. అక్కడ నుండి ఆలయం వరకు బస్ లో వెళ్ళాము.
మనిషికి టక్కెట్ రూ.5లు. సీనియర్ సిటిజన్ల కి ఉచితవాహన సదుపాయం కూడ ఉంది. ఆలయంముందు రోడ్
రధయాత్రకు అనుకూలంగా చాల వెడల్పుగా ఉంటుంది. సాయంకాలం కావడంతో వాతావరణం చల్లగా ఉంది.
అక్కడనుంచి చాల ఎత్తైన ఆలయశిఖరం.. దానిమీద
చక్రం కనిపిస్తూ ఉంది. ఆ చక్రం ఆలయం
చుట్టుప్రక్కల నుండి ఎటునుంచి చూసినా మన వైపే
చూస్తున్నట్టు ఉంటుంది అంటారు. నాకలాగే కనిపించింది. అందరం ఫొటోలు బాగ
దీసుకున్నాము. ఇక్కడ పూరి గురించి కొంచెం
చెప్పాలి .
ఒరిస్సా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరంలో పూరి
పట్టణం ఉంది. ఇక్కడ జగన్నాధస్వామిఆలయం చాల ప్రసిద్ధి. ప్రతియేట ఇక్కడ జరిగే రథాయాత్ర
కన్నులపండువుగా ఉంటుంది. 11వ శతాబ్ధంలో గిరిజనుల దేముడిగా వెలసిన ఈ ఆలయాన్ని 12వ
శతాబ్ధిలో రాజా అనంతవర్మ గంగదేవ్
పునర్నిర్మించాడు. ఇక్కడ దేముడికి
నీలమాధవుడు అని కూడ స్థానిక వ్యవహారం ఉంది. ఈ ఆలయాన్ని
శ్రీమందిరం అని కూడ అంటారు.
ఈ
ఆలయంలో శ్రీకృష్ణుడు ,సుభద్ర, బలరామ సమేతుడై ద ర్శనమిస్తాడు. జూన్ నెలలో జరిగే రధాయాత్రలో
ఈ ముగ్గురిమూర్తులను 3 పెద్ద రధాలలో ఊరేగిస్తారు. ఈ ఊరేగింపును అక్కడి వారు
బడాదందాగా వ్యవహరిస్తారు.ఊరేగింపు విశాలమైన రాచబాటలో సాగి గుండీచ ఆలయంవరకు సాగుతుంది.
ఇక్కడ దేవతావిగ్రహాలు దారుశిల్పాలు. ఈ చెక్కవిగ్రహాలను 12 ఏళ్ళకు ఒకసారి
మారుస్తారు. ఈ క్రొత్తవిగ్రహాలు తయారీ చాల గోప్యంగాను,నిష్ఠగాను సాగుతుంది. ఈ
ఉత్సవాన్ని బకలేవరఉత్సవం అంటారు.
చెప్పులు,సెల్ ఫోన్లు అక్కడ ఉచితకౌంటర్లో డిపోజిట్ చేసి ఆలయంలోకి
ప్రవేశించాము. ఆలయం లో రద్దీ బాగ ఉంది. ఆ రద్దీకి అక్కడ సరైన నియంత్రణ ఉండదు.
అక్కడ పండాలు దీవెనల పేరుతో తలమీద, వీపుమీద చరుస్తూ డబ్బులుకోసం వేధిస్తూఉంటారు. క్రిక్కిరిసి
పోయిన జనం. ఒక క్యూపద్ధతి లేకుండా
జగన్నాధుని దర్శించుకుంటారు. ఈ అసౌకర్యాన్ని అథిగమించి కనులారా జగన్నా
ధుని
దర్శించుకుని సంతోషంగా బయటికి వచ్చాము.
అప్పటికి సమయం 6.00 గం. లవుతోంది.
చీకటి పడుతోంది. దీపాలవెలుగులో ఆలయ శిఖరాలు మెరిసిపోతున్నాయి. చేతులెత్తి మరోసారి
నమస్కరించాము. డిపాజిట్ చేసిన సెల్ ఫోన్లు, చెప్పులు తీసుకుని అక్కడ మరిన్ని ఫొటోలు
తీసుకున్నాము.
పూరిలో ముఖ్యంగా చూడవలసిన బీచ్ ని
చూడటానికి బయలుదేరాము. అక్కడ సముద్రతీరం చాల పొడవుగా ఉంటుంది. మా మరిది లక్ష్మణ్
స్వీట్ పాప్ కార్న్ తెచ్చాడు. తింటూ
ఫొటోలు దిగేము.
ఈ
సముద్ర తీరంలో సుదర్శన్ పట్నాయక్ తరుచుగా చక్కటి సైకత శిల్పాలు తయారు చేస్తూ
ఉంటారు. జాతీయ భావాన్ని, భక్తి భావాన్నీ రేకెత్తించే ఆసైకత శిల్పాలు చూడ తగ్గవి.
అయితే మేము వెళ్ళిన నాడు అవి లేవు.
దాదాపు రెండు గంటలసేపు బీచ్ లో సరదాగా గడిపాము.
అక్కడ మా జంటలకు లొట్టిపిట్ట సవారీ ఒకప్రత్యేకమైన ఆకర్షణ.
బీచ్ ఎదురుగానే పెద్ద
పెద్ద రిసార్టులు హోటళ్ళు ఉన్నాయి . భోజనాలు అక్కడే చేసి రాత్రి గ9.00కి లాడ్జికి చేరుకున్నాము.మా యాత్రలో
భాగంగా పూరిలో దర్శనం, బీచ్ సందర్శన చక్కగా అవడంతో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ
నిద్రకు ఉపక్రమించాము .
కోణార్క్
పూరి నుంచి కోణార్క్ కి దూరం 35.కి.మీ. 13 వ శతాబ్దిలో నిర్మితమైన సూర్యదేవాలయం. దాదాపు
26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. లాంగులా నరసింహదేవ వర్మ నిర్మించారు. ఎత్తు 230
అడుగులు. ఈసూర్యదేవాలయం 24 చక్రాల రాతి రధం. మొగసాల వద్ద నాలుగు గుర్రాలు ఉంటాయి. చక్కటి
నాట్యభంగిమతో అనేక శిల్పాలు కనువిందు చేస్తుంటాయి.
రెండవరోజు ఉదయాన్నే అందరం లేచి తయారై గం.5.00 కే కోణార్క్ బయలుదేరాము. ఒకచోట ఆగి, వేడిగా కాఫీలు
తాగి మళ్ళీ బయలుదేరాము. చీకట్లు ఇంకా
తొలగలేదు. అందరం కబుర్లలో పడ్డాము. కాస్సేపటికి తెల్లవారింది. కాని, మంచు బాగ కురుస్తోంది. ఒకదగ్గరైతే
ఒక్కసారిగ కారుకి 10 అడుగుల దూరంలో కూడ ఏమి కనిపించలేదు. డ్రైవరు నెమ్మదిగా కారు
పోనిచ్చారు. 5నిమిషాల్లో మంచు తగ్గింది. ఒకచోట
ఆగి మంచుకురిసే ఆసయంలో
ఉదయిస్తున్నసూర్యబింబం చాల బాగుండడంతో ఫొటోలు తీసాము. మళ్ళీ బయలుదేరాము.
మరికొంతసేపటికి నదీ సంగమం
దగ్గర ఆగాము. అక్కడ మహానదిపాయ ఒకటి సముద్రంలో కలుస్తోంది. అక్కడ ప్రకృతి దృశ్యం
చాల చాల బాగుంది. కాస్సేపు అక్కడ గడిపి ఫొటోలు తీసుకున్నాము.
కోణార్క్ చేరేసరికి
గం.7.30. అయ్యింది. పార్కింగ్ నుంచి ఆలయం వరుకు
అర కి.మీ. దూరం నడుచుకుంటూ వెళ్ళాము. ఈ ఆలయాన్ని పురావస్తుశాఖవారు నిర్వహిస్తున్నారు.
లోపలికి ప్రవేశానికి టిక్కెట్ ఒకరికి రూ.40..
టిక్కెట్లు తీసుకుని లోపలికి అందరం వెళ్ళాము. ఇక్కడ ఒకవిషయం చెప్పాలి. నేను
మొదటిసారి కోణార్క్ ఆలయాన్ని చూస్తున్నపుడు చాల అద్భుత మనిపించింది. చిన్నప్పటి
క్లాసు పుస్తకంలో బొమ్మ చిన్నదిగా కనించేది. మామూలు చిన్నగుడి అనుకునేదాన్ని.
లోపలికి వెళ్ళగానే
ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టారు ఒక్క ఫొటో తీసుకోండి చాలా బాగ వస్తుంది అంటూ . సరే అని అందరం
కలిసి ఒక ఫొటో తీసునున్నాము. బాగ వచ్చింది.
మండపం మీదకి ఎక్కడానికి ఎత్తైన మెట్లు ఉంటాయి.ఈసారి నాకు ఎక్కడం కొంచెం
కష్టమనిపించింది. అక్కడ శిఖరాన్ని చేతితో తాకుతున్నట్టుగా ఫొటో తీయించుకున్నాము. ఏ కోణంనుంచి
తీస్తే బాగ వస్తుందో అక్కడి వాళ్ళకే తెలుస్తుంది. మా సెల్ ఫోన్ తో తీయడానికి
ఫొటోకి రూ. 10 లు తీసుకున్నాడు. ఆలయం అంతా తిరిగి బయటకి వచ్చేసరికి గం.9.00 లు దాటింది. కారు పార్కింగ్ వరకూ ఆటోలో వెళ్ళాము. మనిషికి పది రూపాయల చొప్పున అయింది. తిరిగి
కారు బయలు దేరింది. దారిలో ఓ పది నిముషాలు ప్రయాణం చేస్తే ఒక మంచి హొటల్ వచ్చింది. అక్కడ టిఫిన్లు బాగున్నాయి. టిఫిన్లు కానిచ్చేక తిరిగి బయలు దేరాము. ఇక మా ప్రయాణం
నేరుగా భువనేశ్వర్ కే. అక్కడ లింగ రాజ్ టెంపుల్
కి పన్నెండు గంటలు దాటకుండా వెళ్తే నిజ దర్శనం అవుతుందని డ్రైవర్ చెప్పారు.
భువనేశ్వర్
కోణార్క నుండి భువనేశ్వర్ 66 కి,మీ.
సుమారు రెండు గంటల ప్రయాణం. 11 వ శతాబ్దిలో
నిర్మిత మయిన ఇక్కడి లింగరాజ్ ఆలయం చాలా బాగుంటుంది. ఇక్కడ వెలసిన లింగానికి త్రిభువనేశ్వరుడు అని
పేరు కూడా ఉంది. ఇక్కడ చాలా లింగాలు చిన్ని చిన్న గుడులలో ఉంటాయి. లింగాలకు రాజు
కనుక లింగరాజుగా ప్రసిద్ధి చెందాడు.శివరాత్రికి ఉత్సవాలు బాగా జరుగుతాయి. ఈ ఆలయ ప్రాంగణంలో భువనేశ్వరీ మాత ఆలయం, విష్ణు
ఆలయం కూడా ఉన్నాయి. ఆలయం దగ్గర వరకు కారు వెళ్ళింది
మేం వెళ్ళే సరికి నిజ దర్శనం మాకు జరుగ
లేదు.అలంకరణ చేసిన స్వామిని దూరం నుండే దర్శించు
కున్నాము. తర్వాత, మేం ముగ్గురం భువనేశ్వరీ మాత ఆలయంలో ప్రమిద దీపాలు
వెలిగించాము. ఆలయమంతా కలియ తిరుగుతూ
ఆనందించేము. బయటకి వస్తూ ప్రసాదాలు కొనుక్కున్నాము. ఫొటోలు తీయడం నిషిద్ధం కనుక కారులోనే సెల్ ఫోన్లు వదిలేసాం. కనుక అక్కడ మా ఫొటో సెషన్ లేదు.
ఆలయం నుండి బయటి కొచ్చాము. ఇక, ఇక్కడ
నుంచి మా ప్రయాణం చిలకసరస్సుకి.
చిలక సరస్సు
చిలక సరస్సు
ఇక్కడికి 127 కి.మీ.దూరం ఉంటుంది. దారిలో ఎక్కడా మాకు శాఖాహారభోజనం దొరికే
హొటల్స్ కనిపించలేదు. అప్పటికి గం.2. లు అయింది. . ఉదయం టిఫిన్లు కాస్త ఎక్కువ అవడం, గం.10 లకి చేయడ వల్ల మరీ పెద్దగా ఆకలీ వెయ్యలేదు. పళ్ళు,చిప్స్,బిస్కట్స్ తో కాలక్షేపం
చేసాము.
చిలక సరస్సుకి ఎలా వెళ్ళాలో వాకబుచేసి
తెలుసు కున్నాము..హైవేమీద ముందుకి వెళ్తే భల్లూగాం అనే నేమ్ బోర్డు కనిపించింది. అక్కడనుంచి 7 కి.మీ. దూరం సైడ్
రోడ్ లో లోపలికి వెళ్తే భల్లూగాం ఊరు వచ్చిది. అక్కడ దిగి సరస్సు దగ్గరకి వెళ్ళేము. గం.4.00 లు అయ్యింది. అక్కడ బోటింగ్ కూడ ఉంది. బోటింగ్ చేసి రావడానికి గం.2.30 లు పడుతుందని
చెప్పారు. ఒక గంట ప్రయాణంచేసాక
చుట్టూనీరున్న గుట్టమీద గుడి ఉంటుంది అక్కడ అరగంట గడిపి తిరిగి రావడానికి గం.2.30 లు పడుతుందని చెప్పారు ఒకరికి రూ.130 లు అవుతుంది. ఒక బోటులో 10 మంది కంటే ఎక్కువ ఎక్కనివ్వరు ”.మరో పదినిమిషాల్లో
కౌంటర్ మూసివేస్తాము. పది టిక్కట్లు కొంటే మీ ఆరుగుర్ని తీసుకెళ్తాము “ అని
ఛెప్పారు. అక్కడకి ఇంకా మాకు ఇంటికి చేరడానికి
గం.7 ల ప్రయాణం ఉంది .
బోటింగ్ కూడాచేసి
వెళ్తే ఇటికి చేరేసరికి అర్ధరాత్రి దాటుతుంది. అందుచేత బోటింగ్ వద్దనుకున్నాము.
సరస్సు ఒడ్డున ఫొటోలు తీసుకుంటూ ఒక అరగంట చాల
హాయిగా గడిపాము. అక్కడే
కాఫీలు తాగి గం.5 కి బయలుదేరాము. గం.8 కి సోంపేట చేరాము. అక్కడ ఉడిపి హొటల్ లో
భోజనాలు చేసాము. బాగున్నాయి.
తిరిగి
బయలుదేరాము. నరసన్నపేట చేరేసరికి పదిన్నర అయ్యింది. రమణ ,మణి అక్కడ దిగిపోయి, మాకు వీడ్కోలు
పలికారు. అక్కడ నుంచి శ్రీకాకుళం ఇంటికి చేరేసరికి గం.11.30 అయ్యింది.
ఇంతటితో మా యాత్ర
పూర్తయింది. మర్నాడు ఉదయాన్నే బయలుదేరి మేమిద్దరం విజయనగరం మా ఇంటికి క్షేమంగా
చేరుకున్నాము. అంత దూరం ప్రయాణం చెయ్య గలమా లేదా అని, మొదట్లో కొంత ఊగిసలాడిన మాకు
ఆ తల్లి చల్లని కృప వల్ల ఏ చికాకూ లేకుండా ప్రయాణం హాయిగా సాగడం సంతోషాన్ని కలిగించిది.
మా అందరికీ ఈయాత్ర చక్కటి అనుభూతిని మిగిల్చింది.
































