ఙ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఙ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, జూన్ 2011, శుక్రవారం

అనగనగా ఒక ఆవు కథ


గోమాత గురించి మా వారి చిన్నప్పుడు మా ఆడపడుచు పెళ్లిలోజరిగిన ఒక సంఘటన చెప్తూ ఉంటారు. ఇప్పటి మాటా అది ! అబ్బో ! 50 యేళ్ళ క్ర్రితం అంటే 1962 లో మా ఆడపడుచు విశాలి పెళ్ళిలోజరిగింది. అవి మీతో పంచుకోవాలని ప్రయత్నం. అప్పటి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురంలో జరిగింది. అప్పట్లో పెళ్ళంటే మూడు నాలుగు నెలలనుంచి ఇంట్లో పనులు ప్రారంభం అయ్యేవి. పసుపు కుంకాలు దంచడం దగ్గర నుంచి, అప్పడాలు వడియాలు తయారు చేసుకోవడం లాంటి పనులు. ఇంటికి వెల్ల వేయించడం సరుకులు తెప్పించి , వాటిని శుభ్ర్రం చేయడం ఒకటా రెండా , ఇలాంటి పనులు! ఇంట్లో అందరూ ఒకటే హడావుడి...సరే ! పెళ్ళి దగ్గర పడింది. రెండు మూడు రోజుల్లోకి వచ్చింది. హఠాత్తుగా ఇంటి ముందు గోమాత ప్రత్యక్షమయింది! అందరి ముఖాల్లో ఆశ్చర్యం, ఆనందం, చెప్పనలవికాని సంతోషం.అంత సంతోషానికి కారణం అది వారి ఇంటి ‘మహాలక్ష్మి కావడమే! ఎదకి రావడం చేత, అప్పటికి రెండు నెలలుగా దానిని ఓ పది మైళ్ళ దూరంలో ఉన్నవారి పొలానికి పంపించారు. దాని వెంట రైతు కూడా రాలేదు! కట్టు తెంచుకుని దానంతట అదే వచ్చేసింది... మా అత్తగారికి అత్తగారు అంటే మా వారి నాన్నమ్మ అచ్చమ్మ గారు అయితే అయ్యోతల్లీ! పెళ్ళికి నిన్ను పిలవడం మరిచిపోయామే! ఇంటి మాలక్ష్మివి..ఎంత పని జరిగిందే.... పెద్ద మనవరాలి పెళ్ళి నువ్వు లేకుండా ఎలా జరుగుతుందే.. అందుకే వచ్చావమ్మా! రామ్మా తల్లీ.. ’’ అంటూ దాన్ని చూసి ఏడ్చినంత పని చేసారుట! అందరూ ఆ మహాలక్ష్మిని పసుపు కుంకాలతో పూజించి హారతులిచ్చి స్వాగతం పలికారు.

మా వారు ఎప్పుడూ ఆ ఆవుని గుర్తు చేసుకుంటూ చెప్తుంటారు. తెల్లని శరీరం మీద ఒక్క మచ్చ కూడ లేకుండా వెన్నెల ముద్దలా మెరిసిపోతూ ఉండేదిట. తల్లి మా లక్ష్మిలా వెలిగి పోతూ ఉండేదిట. పశువు లన్నిటితో మేతకు వెళ్ళిన ఆ ఆవు గోధూళి వేళ , పెరటి గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడేదిట. పెరట్లో పశువుల శాల దగ్గర ఆడుకుంటున్న పిల్లలంతా ఒక్క కేక పెట్టేవారుట...అమ్మా! ఆవొచ్చిందిఅంటూ. పెద్దవాళ్ళెవరో చూసి దాన్ని రాటకు కట్టడం... కుడితె పెట్టడం ... పిల్లలు చోద్యం చూస్తూ ఉండే వారట. ఇంట్లో ఆవు లేక పోతే, పెద్దవాళ్ళకి, పిల్లలకీ కూడా ఏమీ తోచేది కాదుట. మా మామగారి మేనత్త ఒకావిడ కైతే చాలా కోపం వచ్చేస్తుండేదిట. రాదు మరీ! ఉదయం నిద్రలేవగానే ఆవు పృష్ఠ భాగం చూసి దండం పెట్టుకుని గాని ఏ పనిలోకి దిగేవారు కాదుట. భోజనాలు చేసి, ఎంగిళ్ళన్నీ ఎత్తాక... ఆవులశాల లోకి వెళ్ళి, చిన్నపిసరు గోమయం చేతిలోకి తీసుకుని ఇన్ని నీళ్ళతో అక్కడ చిలకరించి బట్టపెట్టి తుడిస్తే గానీ, అక్కడ శుధ్ధి అయినట్టు లెక్క కాదు, ఆవిడ దృష్టిలో !

ఇలాంటి మా ఇంటి మాలక్ష్మి శభకార్యం వేళ ఇంటికొచ్చిన సంతోషం ఎక్కువ రోజులు ఎవరికీ

మిగల్లేదు. మా ఆడపడుచు పెళ్ళయిన నాలుగైదు రోజులకే ఏమైందో ఏమో తెలియదు గాని

ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపొయింది . తెల్లావు కడతేరి పోయింది. ఇంట్లో అంతా తెల్లావు పోవడంతో

ఆ బాధ నుండి చాలా రోజుల వరకూ తేరుకో లేక పోయారు.

పెళ్ళికి వచ్చిన బంధువులతో కళ కళలాడిన ఆ ఇల్లు, పెళ్ళవగానే చుట్టాలందరూ

ఒక్కొక్కరే వెళ్ళి పోవడంతో బోసి పోయింది. ఆ మర్నాడో, మూడో నాడో, తెల్లావు

కూడా వెళ్ళిపోయింది. తెల్లావు లేని మా పశువుల శాల కూడా బోసి పోయింది.


ముద్దు కృష్ణ జ్యోతి పంపిన వీడియో ఈ క్రింద చూడండి: