24, నవంబర్ 2011, గురువారం

వంకాయ బండపచ్చడి


వంకాయని వెయ్యి రకాలుగా వండొచ్చని నానుడి ఉంది కదా..సంతర్పణ వంటల్లో తప్పని సరిగ వంకాయని వండుతారు. వంకాయని ఉడికించి గాని, నూనెలో వేయించి గానిచేస్తుంటాం. అలా కాకుండా వంకాయని నిప్పులమీద కాల్చి చేసే రకం. చాలా బాగుంటుంది. ( గేస్ స్టౌవ్ మీద కూడ సిమ్ లో పెట్టి కాల్చొచ్చు )

పెద్ద సైజు వంకాయలు కాల్చడానికి వీలుగ ఉంటాయి. అవి తీసుకోవాలి.

వంకాయ బండ పచ్చడి ఎలా చెయ్యాలో చెప్తాను.

కావలసిన పదార్ధాలు;

1. వంకాయలు --1 లేక 2 పెద్ద సైజువి

2. అల్లం -చిన్నముక్క

3. ఆవాలు

4. జీలకఱ్ఱ

5. మినపప్పు

6. ఎండు మిర్చి

7. పచ్చి మిర్చి

8. చింతపండు --తగినంత

9. ఉప్పు

10. పసుపు

11. కొత్తిమీర - చిన్న కప్పు

వంకాయని మొదట కాయంతటికి పట్టేలా కాస్త నూనె రాయాలి. ఇప్పుడు నిప్పుల మీద కాల్చాలి. చల్లారేక పై తొక్క తడిచేసుకుంటూ జాగ్రత్తగా తియ్యాలి. లోపలి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి . ఇప్పుడు అల్లం, పచ్చిమర్చి, చింతపండు, ఉప్పు, పసుపు కొత్తిమీర అన్నీ రోటిలో వేసి బండతో చితకొట్టాలి.

తరువాత వంకాయగుజ్జు కూడ వేసి కచ్చా పచ్చాగ చితకొట్టి ఒకగిన్నెలోకి తీసుకోవాలి.ఇపుడు స్టౌమీద మూకుడు పెట్టి కాస్త నూనె వేసి వేడెక్కాక ఆవాలు. జీలకఱ్ఱ, మినపపప్పు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టి పచ్చడిలో కలపాలి. వంకాయ బండ పచ్చడి రెడీ. అన్నంలోకి బాగుంటుంది. నచ్చితే చపాతితో కూడ తినోచ్చు. వంకాయపులుసు పచ్చడి మరోసారి చెప్తాను.

9 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీ వంకాయ బండ పచ్చడి చాలా బాగుందండీ అమ్మమ్మ గారూ ! మా కోసం ఇలాగే మరిన్ని రుచికరమైన పచ్చళ్ళు చేయడం గురించి రాస్తూ ఉండండి

అజ్ఞాత చెప్పారు...

రుచిగా ఉంది

అజ్ఞాత చెప్పారు...

ఈ వంకాయ బండ పచ్చడి చేయడానికి కుంపటి నిప్పుల మీద బాగుంటుంది. కదా

Voleti Srinivasa Bhanu చెప్పారు...

vanta chesi inti ki pilichi vaddistee baaguntundandee

kiran చెప్పారు...

ఓకే. చింతపండు నానబెట్టి గుజ్జుని వేస్తాను నేను.

kiran చెప్పారు...

అది సరే ఇవి కాదు గాని అమ్మా, వాసు పెళ్లి లో వ్రతం నాడు ప్రసాదం చేసావు చూడూ(హాట్ కేక్ అనొచ్చా?) అది వ్రాయి. అంటే కేవలం తయారి అని కాదు నువ్వు చాల నిష్టగా చేస్తావు కదా గిన్నెకి పసుపు,బొట్టు గట్రా అలా అదంతా అన్నమాట. అందుకే ఆరోజు అంత రుచి వచ్చింది.

పంతుల సీతాపతి రావు చెప్పారు...

వంకాయ వంటి కూరయు టెంకాయ వంటి పచ్చడి అన్నారు గాని

వంకాయ బండ పచ్చడి గూర్చి బాగా చెప్పావ్ .ఆ పచ్చడికి బెల్లం

కలిపితే ఇంకా రుచికరంగా వుంటుంది మా అమ్మ అలాగే చేసేది

జుర్రు కుంటూ తినే వాళ్ళం . బండ పచ్చడి కాదు అది వంకాయ

పులుసు పచ్చడి

Unknown చెప్పారు...

వంకాయ బండ పచ్చడి రుచే వేరు.కాకపోతే మా అమ్మమ్మ గారు అల్లం వేసేవారు కాదు.

పంతుల సీతాపతి రావు చెప్పారు...

అమ్మమ్మ గారి కబుర్లు ఆపేసేరేమి?
రాస్తూ వుండండి వి..జయ గారు