
ఈ వేసవి కాలం ఎండలు చాలా చిరాకు కలిగిస్తాయి. కానీ, మామిడి కాయలు మాత్రం నోరూరిస్తూ అంగట్లో రోజు దర్శనమిస్తూ ఉంటాయి. ఎంత వద్దనుకున్నా ఆ పుల్ల పుల్లని మామిడికాయలు చూస్తూ ఆవకాయలు పెట్టకుండా ఉండ గలమా? ఇంట్టో కుటుంబ సభ్యులకు బి.పి.లు...ఉన్నా....షుగర్లు ఉన్నా...ఆవకాయలు పెట్టడం మాత్రం మానం .ఎంతైనా.. ఆంధ్రులం. సార్ధకనామధేయం తుడిచి పెట్టుకు పోదూ !
మామిడికాయలతో రకరకాలుగా ఆవకాయలు పెట్టొచ్చు.ఈవిషయం అందరికీ తెలిసిందే.ఆవకాయని బెల్లం గాని, పంచదార గాని వేసి తియ్యగా పెట్టొచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఉప్పు తక్కువ తినాలనుకున్నవారికి కూడ కొంత మంచిది. ఎందుకంటే ....మామూలు ఊరగాయ కంటే ఇందులో ఉప్పు
తక్కువ పడుతుంది.
పంచదార వేసి ఆవకాయా?! ..అని ఆశ్చర్య పోతున్నారా? నిజమేనండీ..చాల రుచిగా ఉంటుంది. ఏడాది పొడుగునా నిలవ ఉంటుంది. ఎండబెట్ట నవసరం లేదు. బెల్లం వేస్తే మాత్రం వారం రోజులపాటు ఎండ పెట్టాలి.
పంచదార ఆవకాయ తయారీకి మరీ పుల్లని మామిడికాయలు తీసుకోకూడదు. పులుపు కొంచెం తక్కువ ఉంటే బావుంటుంది.
ఆవపొడి--4 పావులు--కారం--2పావులు--ఉప్పు రెండున్నర పావులు, నూనె 1పావు పంచదార 4పావులు
ఆవపొడి, ఉప్పు, కారం మూడు కలిపిన మిశ్రమాన్ని ఒక గిన్నె లోకి నిండుగా తీసుకోవాలి.అదే గిన్నెతో 2 గిన్నెలు
మామిడికాయ ముక్కలు తీసుకోవాలి.ఆవపొడి మిశ్రమంలో పంచదార వేసి బాగ కలపాలి. మామిడికాయముక్కలు
కొద్ది కొద్దిగ వేస్తూ గుచ్చెత్తి జాడీలో పెట్టాలి.పైన కొద్దిగ నూనె వెయ్యాలి.మూడు రోజులతరువాత మిగిలిన నూనె వేసి
బాగ కలపాలి. ఈ యేడాది పెట్టి చూడండి. ఇక ప్రతి సంవత్సరం పిల్లలు అదే కావాలంటారు. తీపి ఎక్కువ కావాలను
కున్నవారు పంచదార మరి కాస్త ఎక్కువ వేసుకోవచ్చు.
బెల్లం వేసే ఆవకాయకి కూడా కొలతలు అన్నీ పై విధంగానే..కాని..వారం రోజులు ఊరిన తరువాత.. ఊట నుండి ముక్కలు వేరు చేసి...విడి విడిగా ఊట ముక్కలు వారం రోజులపాటు ఎండ పెట్టాలి. తరువాత, ఊటలో ముక్కలు
బాగా కలిపి జాడీలో పెట్టాలి. ఈ ఆవకాయ రెండు నెలల తరువాత తింటే చాల రుచిగా ఉంటుంది.రెండు సంవత్సరాలైనానిలవ ఉంటుంది.
